హైడ్రా కమీషనర్ రంగనాద్‌కి ఈరోజు హైకోర్టు నోటీస్ జారీ చేసింది. అమీన్‌పూర్ చెరువు బఫర్ జోన్‌లో ఓ పెద్ద భవనాన్ని ఇటీవల హైడ్రా కూల్చివేసింది. ఆ భవనానికి సంబందించి కేసు హైకోర్టులో ఉందని సదర్ భవనం యజమాని చెపుతున్నా హైడ్రా అధికారులు ఆయన మాటలు పట్టించుకోకుండా కూల్చివేశారు.
ఇది కోర్టు ధిక్కారమే అంటూ భవన యజమాని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం హైడ్రా కమీషనర్ రంగనాద్‌కి నోటీస్ జారీ చేసి సోమవారం జరుగబోయే విచారణకు హాజరయ్యి వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించింది.
హైడ్రా కమీషనర్ రంగనాద్‌కి హైకోర్టు నోటీస్ జారీ చేసి విచారణకి రప్పించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ రెండు వారాల క్రితం హైడ్రా తీరుని, చట్టబద్దతని ప్రశ్నిస్తూ హైడ్రాకి, ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
వెంటనే సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించి హైడ్రాకి చట్టబద్దత కల్పించడమే కాకుండా దానికి వెయ్యిమందికి పైగా అధికారులు, సిబ్బందిని కేటాయిస్తూ ఆమోదముద్ర వేశారు.
కనుక ఇప్పుడు చట్టబద్దత విషయంలో సమస్య ఉండకపోవచ్చు కానీ ప్రజలకు తగినంత సమయం ఇవ్వకుండా, వారిని తమ ఇళ్ళలో సామాన్లు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ఇళ్ళు కూల్చివేస్తుండటంపై హైకోర్టులో మొట్టికాయలు పడే అవకాశం ఉండవచ్చు.