జగన్‌ తిరుమల పర్యటన రద్దు

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వివిద రాష్ట్రాలు, దేశాల నుంచి ఎందరో భక్తులు, పలువురు ప్రముఖులు వస్తుంటారు. కానీ ఏనాడూ ఎటువంటి వివాదాలు ఏర్పడలేదు.

అయితే తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిన తర్వాత జగన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుండటంతో వాటి నుంచి అందరి దృష్టిని మళ్ళించేందుకు నేడు తిరుమల పర్యటనకి బయలుదేరుతున్నానని ప్రకటించారు.

ఊహించిన్నట్లే ఏపీలో అధికార టిడిపి, జనసేన, బీజేపీలు చాలా హడావుడి చేశాయి. జగన్‌ తిరుపతిలో కాలు పెట్టకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తిరుపతి పట్టణ పోలీసులు  వైసీపి నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్, గృహ నిర్బంధాలు చేశారు. 

జగన్‌ కోరుకుంటున్నది కూడా అదే. కనుక తనపై దాడి చేసేందుకు టిడిపి, జనసేన, బీజేపీలు కుట్ర చేస్తున్నాయనే వంకతో జగన్‌ తిరుమల పర్యటనని రద్దు చేసుకుని, తాడేపల్లి ప్యాలస్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేసి, తాను దైవ దర్శనం చేసుకోవాలనుకున్నా టిడిపి కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని, ఏపీలో సిఎం చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్నారంటూ జగన్‌ నిప్పులు చెరిగారు.

చంద్రబాబు నాయుడు కల్తీ నెయ్యి అంటూ అబద్దాలు చెపుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా చాలా ఆరోపణలే చేశారు. అవన్నీ అప్రస్తుతం. మొత్తం మీద రెండు రోజుల హడావుడి ఏమీ లేకుండానే ముగిసింది.