తిరుపతిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం!

మరికొద్ది సేపటిలో ఏపీ మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి తిరుమల చేరుకోబోతున్నారు. రాత్రి కొండపై కాటేజీలో బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత మళ్ళీ విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు. 

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జగన్మోహన్‌ రెడ్డి, వాటిని బలంగా తిప్పి కొట్టడానికే, తిరుమల పేరుతో సిఎం చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన చేస్తున్న పాపాలకు ప్రాయశ్చిత్తంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నానని ప్రకటించడంతో టిడిపి, బీజేపీ, జనసేన, హిందూ సంఘాలు ఆయన రాకని వ్యతిరేకిస్తూ తిరుపతి పట్టణంలో ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నాయి. 

అయితే వైసీపి నేతలు, కార్యకర్తలు భారీ ఊరేగింపుతో జగన్‌ని తోడ్కొని తిరుమల కొండపైకి వెళ్ళడానికి సిద్దం అవుతున్నారు. దీంతో తిరుపతి పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్తులు తమకు స్వామివారిపై నమ్మకం, భక్తి ఉన్నాయని పేర్కొంటూ రిజిస్టర్‌లో సంతకం చేయాలి. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంతటివారు కూడా ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ సంతకం చేశారు. 

కానీ జగన్మోహన్‌ రెడ్డి ఆ డిక్లరేషన్‌పై సంతకం చేయరని సీనియర్ వైసీపి నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించడంతో పట్టణంలో ధర్నాలు చేస్తున్నవారు ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. సంతకం చేయకపోతే జగన్‌ని కొండపై అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

కనుక తిరుపతి పట్టణంలో వేలాదిమందిని  పోలీసులు మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్నట్లుంది పరిస్థితి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జగన్‌ రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుమలకి బయలుదేరుతారు.