హైడ్రా కూల్చివేతలలోతో నిర్వాసితులుగా మారబోతున్న మూసీవాసులకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో 16,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, జలవనరుల శాఖల అధికారులు నిర్వాసితులతో మాట్లాడి ఒప్పించి ఒకరొకరినే అక్కడి నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలోకి తరలిస్తున్నారు.
దీనిపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురుకుగా స్పందిస్తూ, నాడు మేము నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించామని చెపితే కాంగ్రెస్ నేతలు మమ్మల్ని ఎద్దేవా చేశారు. ఇళ్ళు ఎక్కడ నిర్మించారో చూపమని సవాళ్ళు విసిరారు. ఇళ్ళు కట్టకుండానే కట్టామని మేము అబద్దాలు చెపుతున్నామని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అవే ఇళ్ళలోకి మూసీవాసులకు కేటాయిస్తున్నారు. అంటే రాత్రికి రాత్రి నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పుట్టుకొచ్చాయా?” అంటూ ఎద్దేవా చేశారు.
“మేము నిర్మిస్తే - మీరు కూల్చేస్తున్నారు మాది నిర్మాణం - మీది విధ్వంసం లక్షల నిర్మాణాలు మావి - లక్షల కూల్చివేతలు మీవి. మూసి నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదే.
కట్టలేదన్నారు-ప్రజలను మభ్యపెట్టాం అన్నారు-మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి చిట్టి? మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా?
కేసీఆర్ నిజం, అయన హామీలు నిజం ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్ కు ఇవ్వాళా కేసీఆర్ గారి నిర్మాణాలే దిక్కయ్యాయి కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం-కేటాయింపులు నిజం మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి,” అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. తమ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ఫోటోని, వాటికి సంబందించి న్యూస్ పేపర్లలో వార్తల క్లిపింగ్ కూడా ట్విట్టర్‌లో జత చేశారు.