తెలంగాణ నీటి పారుదలశాఖలో కొత్తగా ఉద్యోగాలలో చేరుతున్న 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సిఎం రేవంత్ రెడ్డి నేడు జలసౌధ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“కొత్తగా ఉద్యోగాలలో చేరుతున్న మీ అందరికీ కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుల నుంచి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఓ ఇంజనీరు తన జీవితంలో ఎటువంటి తప్పులు చేయకూడదో తెలియజేస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు.
ఎప్పుడో దశాబ్ధాల క్రితం కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ నేటికీ పటిష్టంగా నిలిచి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతోంది. వాటిని చాలా నాణ్యంగా నియమించినందునే దశాబ్ధాలు గడుస్తున్నా చెక్కు చెదరలేదు.
కానీ 5 ఏళ్ళు గడవక మునుపే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజి క్రుంగిపోయింది. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గోడలకు పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు సక్రమంగా, నిబద్దతతో పని చేసి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇటువంటి లోపాలు ఏర్పడి ఉండేవే కావు.
కనుక మీరందరూ కూడా అటువంటి తప్పులు చేయొద్దు. పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారనో, మరొక కారణంతో నాణ్యతతో రాజీ పడొద్దు. పడితే ఆ ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు ఇప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో మీరు అటువంటివే ఎదుర్కోవలసి వస్తుంది. మీలో ప్రతీ ఒక్కరూ పూర్తి నిబద్దతతో పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైన కట్టడాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.