మూసీ నిర్వాసితులు అదృష్టవంతులే

ఇప్పటి వరకు హైడ్రా దెబ్బకు వందలాది పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తర్వాత మూసీనది గర్భంలో ఒడ్డున 55 కిమీ పొడవునా ఉన్న ఇళ్ళని కూల్చేసేందుకు హైడ్రా సిద్దం అవుతోంది. అయితే ఇప్పటి వరకు ఇళ్ళు కోల్పోయినవారితో పోలిస్తే మూసీలో కాబోయే నిర్వాసితులు అదృష్టవంతులే అని చేపోచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం నగరంలో వేరేవేరు ప్రాంతాలలో ఖాళీగా 16,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని గుర్తించి వాటిని నిర్వాసితులకు కేటాయించేందుకు నేడు జీవో కూడా జారీ చేసింది. మూసీలో  మొత్తం 10,200 కుటుంబాలు ఇళ్ళు కట్టుకొని ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. 

రంగారెడ్డి జిల్లా ఆర్డీవో వెంకట్ రెడ్డి అధ్వర్యంలో రెవెన్యూ, మునిసిపల్ అధికారులు రాజేంద్రనగర్ పరిధిలో అత్తాపూర్ వద్ద మూసీ నదిలో ఇళ్ళని పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ అధ్వర్యంలో నాలుగు బృందాలు ఇంటింటికీ వెళ్ళి పేర్లు వివరాలు నమోదు చేసుకుంటున్నారు.

ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది కనుక ముందుగా వారందరికీ ఆ ఇళ్ళు అప్పగించి వారు వాటిలోకి మారిన తర్వాత కూల్చివేతలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. కనుక మూసీ నిర్వాసితులు అదృష్టవంతులే అని భావించవచ్చు.