దర్శనం మొగిలయ్యకి స్థలం పత్రాలు అందజేసిన సిఎం రేవంత్‌

ప్రముఖ కిన్నెరమెట్ల వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకి ఇల్లు నిర్మించుకునేందుకుగాను 600 చదరపు గజాల స్థలం తాలూకు పత్రాలని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బుధవారం ఉదయం స్వయంగా అందజేశారు. తనకు ఇంటి స్థలం కేటాయించి పత్రాలు అందజేసినందుకు మొగిలయ్య ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 

మొగిలయ్య ఓ విలక్షణమైన వాద్య కళాకారుడు. కానీ ఆయన ప్రతిభని మొట్ట మొదట పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ గుర్తించి తాను నటించిన భీమ్లా నాయక్ సినిమాలో ఓ పాట పాడేందుకు అవకాశం కల్పించారు. అప్పటి నుంచే మొగిలయ్య పేరు మారుమ్రోగిపోయింది.

కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన ప్రతిభని గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ఆయనకు కోటి రూపాయలు నగదు, 600 గజాల స్థలం ఇస్తామని చెప్పి నగదు బహుమతి అందించారు. కానీ ఎన్నికలు రావడంతో స్థలం ఇవ్వలేకపోయారు.

ఇప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి పద్మశ్రీ మొగిలయ్యకి హయాత్ నగర్‌లో 600 చదరపు గజాల స్థలం కేటాయించి స్వయంగా ఆ స్థలం పత్రాలను ఆయనకు అందించారు. తమ ప్రభుత్వం కళాకారులను ఎల్లప్పుడూ గౌరవిస్తుందని చెప్పారు.