నటుడు ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో జరుగుతున్న రాజకీయాలను ఖండిస్తూ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి ఓ ట్వీట్ చేశారు.
ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూనే, “మీరు దీని గురించి ప్రజలకు భయాందోళనలు ఎందుకు కలిగిస్తున్నారు? దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ఎందుకు చేస్తున్నారు?మనదేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తలు సరిపోవనా? కేంద్రంలో మీ స్నేహితులకు థాంక్స్. #జస్ట్ ఆస్కింగ్” అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
దానిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, “తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. గత ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన టీటీడీ బోర్డు చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.
అయితే ఈ ఒక్క వ్యవహారంతో టీటీడీలో చాలా అవకతవకలు బయటపడ్డాయి. వాటిపై మా ప్రభుత్వం విచారణ జరిపించి కటిన చర్యలు చేపడుతుంది. హిందూ దేవాలయాలలో ఇటువంటి అపచారాలు పునరావృతం కాకుండా ఉండేందుకు, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జాతీయస్థాయిలో ఓ కమిటీని ఏర్పాటుచేయాల్సి ఉందని భావిస్తున్నారు,” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ట్వీట్‌పై మళ్ళీ ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, “పవన్ కళ్యాణ్‌గారు నేను అడిగినది ఏమిటి? మీరు చెప్పిన సమాధానం ఏమిటి? రెంటికీ ఏమైనా సంబంధం ఉందా? ప్రస్తుతం నేను విదేశంలో ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. ఈ నెల 30న హైదరాబాద్ తిరిగివస్తాను. వచ్చిన తర్వాత మీరు మాట్లాడిన ప్రతీ మాటకు నేను సమాధానం చెపుతాను,” అని ప్రకాష్ రాజ్ ఓ వీడియో మెసేజ్ పెట్టారు.
ఇంతకు ముందు ఇదే అంశంపై మా అధ్యక్షుడు మంచువిష్ణు, ప్రకాష్ రాజ్‌కి మద్య ట్విట్టర్‌లో చిన్న యుద్ధం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో మరో యుద్ధం మొదలైంది.