బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం కూకట్‌పల్లి వెళ్ళి హైడ్రా ఇళ్ళు కూల్చివేసినవారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “హైడ్రా కూల్చివేతలు దుర్మార్గం. ప్రజలకు సంక్షేమ పధకాలు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఓట్లు వేసినవారి ఇళ్ళనే కూల్చేసి రోడ్డున పడేయడం చాలా దుర్మార్గం. చెరువులు, నాలాలు కబ్జాల నుంచి విముక్తి కల్పిస్తున్నామని చెప్పుకుంటున్నారు.
హైదరాబాద్‌లో మసాబ్ ట్యాంక్‌తో సహా పలు చెరువులు కబ్జా చేయబడ్డాయి. అక్కడ ఐమాక్స్ థియేటర్లు, పెద్ద పెద్దషాపింగ్ మాల్స్ వెలిశాయి. వాటన్నిటినీ కూడా కూలగొట్టించే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా? మీ ప్రభుత్వం ప్రతాపం అంతా నిరుపేదలు, మద్యతరగతి ప్రజలపైనే చూపుతారా?
కనీసం ఇళ్ళలో, దుకాణాలలో సామాన్లు కూడా తీసుకోనీయకుండా కూల్చేసి వారిని రోడ్డున పడేసింది. వారందరూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఏవో చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతుంటే, వారికి ఆ జీవనోపాధి కూడా లేకుండా చేస్తోంది కదా మీ ప్రభుత్వం?
శని,ఆదివారాలు కోర్టులకు సెలవులు ఉన్నప్పుడు హైడ్రా ఇళ్ళు కూల్చేయడానికి బయటలుదేరడాన్ని ఏమనుకోవాలి?అంటే బాధితులు ఎవరూ కోర్టుకి వెళ్ళలేని సమయం చూసి కూల్చివేస్తున్నారన్న మాట! అంటే మీ ప్రభుత్వానికి న్యాయస్థానాల మీద కూడా నమ్మకం, గౌరవం లేదా?
కోర్టుకి తెలియకుండా ఇళ్ళు కూల్చేస్తే రేపు కోర్టులు మీ ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఉంటాయా?అప్పుడేమి చేస్తారు? ఇప్పటికైనా ఈ కూల్చివేతలను నిలిపివేయండి. లేకుంటే పేదల కన్నీళ్ళు, ఉసురు తగిలితే మీకే నష్టం,” అని ఈటల రాజేందర్ అన్నారు.
(Video Courtecy: Telugu Scribe)