తిరుమల లడ్డూ ఎఫెక్ట్: యాదాద్రి ప్రసాదాలు ల్యాబ్‌కి

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతుండటంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. స్వామివారి నైవేద్యంగా భక్తులకు పంపిణీ చేస్తున్న ప్రసాదం తయారీకి వాడుతున్న నెయ్యి, నూనెలను పరీక్ష కోసం హైదరాబాద్‌లో ల్యాబ్‌కి పంపారు. వాటితో పాటు యాదాద్రిలో తయారైన లడ్డూ, పులిహోర ప్రసాదాలను కూడా పరీక్షల కోసం ల్యాబ్‌కి పంపారు. యాదాద్రికి మదర్ డెయిరీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

ల్యాబ్‌ రిపోర్టులో కల్తీ లేదని నిర్ధారిస్తే మంచిదే కానీ కల్తీ జరిగిన్నట్లు తెలిస్తే ప్రస్తుతం ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై అధికార టిడిపి, జనసేన ప్రతిపక్ష వైసీపిల మద్య పెద్ద రాజకీయ యుద్దాలు జరుగుతున్నట్లే, తెలంగాణ రాష్ట్రంలో కూడా దీనిపై కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయ యుద్ధం మొదలవడం, దానిని బీజేపీ అందిపుచ్చుకోవడం ఖాయం. 

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం బయటపడిన తర్వాత అన్ని రాష్ట్రాలలో ప్రధాన ఆలయాలు అప్రమత్తమయ్యాయి. ఆలయాలకు సరఫరా అయ్యే నెయ్యి, నూనె, పాలు వగైరా నమూనాలను ల్యాబ్‌కి పంపించి పరీక్షలు చేయిస్తున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాలలో కొన్ని ప్రధాన ఆలయాలలో భక్తులు బయట మార్కెట్లో కొనుగోలు చేసి తెచ్చిన లడ్డూ ప్రసాదాలను పంచుతుండేవారు. ఇప్పుడు వాటిపై నిషేదం విధించి కేవలం ఇంట్లో వండి తెచ్చిన వాటినే అనుమతిస్తున్నారు.