తెలంగాణలో వన్ స్టేట్... వన్ డిజిటల్ కార్డ్

తెలంగాణ ప్రభుత్వం ఈసారి తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీకి వేర్వేరుగా డిజిటల్ కార్డులు జారీ చేయబోతోందని వార్తలు వచ్చాయి. అయితే సోమవారం సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో ‘వన్ స్టేట్... వన్ డిజిటల్ కార్డ్’ విధానం అమలుచేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ ఈ డిజిటల్ కార్డులు అందించాలని, వాటితోనే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరులు తీసుకునేందుకు, ఎక్కడైనా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పొందుందుకు వీలుగా రూపొందించాలని నిర్ణయించారు. ఈ డిజిటల్ కార్డులలో కుటుంబ సభ్యులకు సంబందించి పూర్తి ఆరోగ్య సమాచారం నమోదు చేసి నిర్ణీత వ్యవధిలో అప్‌డేట్‌ చేయాలని నిర్ణయించారు.

ఈ నూతన విధానంలో సాధకబాధకాలు తెలుసుకునేందుకు ముందుగా ప్రతీ జిల్లాలో ఓ గ్రామాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయాలని నిర్ణయించారు. కర్ణాటక, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాలలో ఇప్పటికే ఈ విధానం అమలుచేస్తున్నారు. కనుక సంబందిత అధికారులను ఈ మూడు రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి సూచించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి,దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతి కుమారి, సిఎం కార్యదర్శులు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, కమీషనర్‌ తదితరులు పాల్గొన్నారు.