బెయిల్ కోసం తిరుపతన్న పిటిషన్

తెలంగాణలో సంచలనం సృష్టించిన  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి మేకల తిరుపతన్న హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేయగా దానిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి శనివారం విచారణ జరిపారు.  ఆయన తరపు వాదించిన న్యాయవాది సురేందర్ రావు తన వాదనలు వినిపిస్తూ, ఓ పోలీస్ అధికారి అయిన తిరుపతన్న తనపై అధికారి ప్రణీత్ రావు ఆదేశాల ప్రకారమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు తప్ప తనంతట తానుగా ఎటువంటి నేరమూ చేయలేదని వాదించారు. 

ఈ కేసుకి సంబందించి విచారణ అధికారులు ఇప్పటికే కోర్టు పూర్తి వివరాలతో ఓ నివేదిక సమర్పించినందున, ఇంకా తిరుపతన్నని జైల్లో నిర్బందించి ఉంచాల్సిన అవసరం లేదు కనుక బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. 

కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు అభ్యంతరం చెప్పారు. ఈ కేసులో స్పెషల్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో సహా నిందితులు అందరూ నేరంలో భాగస్తులే అని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌, ఆయన ఇద్దరి గన్‌మ్యాన్‌ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి, బిఆర్ఎస్ పార్టీకి అందిస్తే ఆ సమాచారాన్ని ఆ పార్టీ ఎన్నికలలో ఉపయోగించుకుందని వాదించారు. 

కనుక కుట్రపూరితంగా జరిగిన ఈ నేరంలో తిరుపతన్న కూడా ఒక భాగస్వామి అని వాదించారు. త్వరలో ఛార్జ్ షీట్‌ దాఖలు చేయబోతున్నామని కనుక తిరుపతన్నకి బెయిల్‌ మంజూరు చేయవద్దని వాదించారు. 

ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ కమీషన్‌ జువ్వాడి శ్రీదేవి తీర్పు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.