ఆదివారంవస్తే హైడ్రాతో గుబులు

హైదరాబాద్‌ నగరవాసులకు హైడ్రా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇదివరకు శని, ఆదివారం రెండు రోజులు వారాంతపు సెలవులు వచ్చినప్పుడు ప్రతీ ఇంట్లో సందడిగా ఉండేది. ఇప్పుడు వారాంతపు సెలవు రోజులు వస్తే ఎక్కడ హైడ్రా సిబ్బంది జేసీబీలతో తమ ఇళ్ళని కూల్చివేస్తారో అని తీవ్ర ఆందోళనతో గడుపుతున్నారు. 

రెండు వారాల విరామం తర్వాత మళ్ళీ ఇవాళ్ళ (ఆదివారం) హైడ్రా సిబ్బంది జేసీబీలు, భారీ పోలీస్ బందోబస్తుతో కూకట్‌పల్లిలోని నల్లచెరువు బఫర్ జోన్‌ వద్దకు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలు కాగా దానిలో 7 ఎకరాలు ఆక్రమణలకు గురైన్నట్లు హైడ్రా గుర్తించింది. ఆ ఏడు ఎకరాలలో అనేక అపార్ట్‌మెంట్‌లు, భవనాలు, భారీ షెడ్లు నిర్మించబడి ఉన్నాయి. 

అపార్ట్‌మెంట్‌లలో సామాన్య మధ్యతరగతి ప్రజలే నివాసం ఉంటున్నారు. పొద్దున నిద్రలేచేసరికి కాలనీలో హైడ్రా సిబ్బందిని చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. 

అయితే హైడ్రా కమీషనర్‌ ఏవీ రంగనాధ్ ముందే చెప్పిన్నట్లుగా కుటుంబాలు నివశిస్తున్న అపార్ట్‌మెంట్‌ల జోలికి హైడ్రా సిబ్బంది వెళ్ళలేదు. ఎఫ్‌టిఎల్ పరిధిలో మూడు ఎకరాలలో 25 భవనాలు, 16 భారీ షెడ్లు ఉన్నాయి. వాటిలో షెడ్స్ మాత్రమే కూల్చివేస్తున్నారు. ఇదే సమయంలో అమీన్‌పూర్‌లో అక్రమ కట్టడాలని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.