శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో సీపీఎం దివంగత నేత సీతారాం ఏచూరి సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు సిఎం రేవంత్ రెడ్డి, సీపీఐ, సీపీఎం, బిఆర్ఎస్, టీజేఎస్ తదితర పార్టీల ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. అందరూ సీతారాం ఏచూరితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన మార్గం స్పూర్తిదాయకం అంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారందరూ జమిలి ఎన్నికల ప్రతిపాదనని ప్రస్తావించి ముక్తకంఠంతో వ్యతిరేకించడం విశేషం.
సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కేంద్రం దేశ ప్రజల మద్య ప్రాంతాలు, భాషలు, మతం పేరుతో చిచ్చురగిలించి అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో యావత్ దేశాన్ని బీజేపీ కబళించే ప్రయత్నం చేస్తోంది. దేశ ఐఖ్యతని దెబ్బ తీస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడుదాము,” అని అన్నారు.
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ “ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో ఎన్నికల ఖర్చు తగ్గుతుందని చెపుతూ ప్రజాస్వామ్యాన్ని చంపేయాలని ఎన్డీయే ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇటువంటి ఎత్తులు, జిత్తుల వలన ప్రజాస్వామ్యం దెబ్బతినకుండా అందరం కలిసి కాపాడుకోవాలి,” అని అన్నారు.
జమిలి ఎన్నికలపై చర్చకు అది వేదిక కానప్పటికీ దానిపై రాష్ట్రంలోని పార్టీల అభిప్రాయాలు ప్రజలకు చెప్పాయని భావించవచ్చు.