రాహుల్ స్పందించారు ఇక కాంగ్రెస్‌ నేతల వంతు

తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై కాంగ్రెస్‌ యువరాజు రాహుల్ గాంధీ స్పందిస్తూ, “తిరుమల స్వామివారి ప్రసాదంలో కల్తీ గురించి వస్తున్న వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఈ కల్తీ వ్యవహారంతో ప్రతీ భక్తుడి మనోభావాలు దెబ్బ తింటున్నాయి. కనుక దీనిపై విచారణ జరిపించాలి,” అని ట్వీట్‌ చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ఒక్కరే దీనిని తీవ్రంగా ఖండించి తక్షణం విచారణ జరిపించాలని కోరుతూ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి లేఖ వ్రాశారు. సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు కూడా దీనిని ఖండించారు.

ఈ అంశంపై రాహుల్ గాంధీ తన స్పందన తెలియజేశారు కనుక తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి లేదా ప్రభుత్వం, పార్టీ తరపున కాంగ్రెస్‌ మంత్రులు లేదా పార్టీ అధ్యక్షుడు స్పందించవచ్చు. 

అయితే ఇది చాలా సున్నితమైన అంశం పైగా రాజకీయాలతో ముడిపడి ఉంది కనుక ఇంతవరకు బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ దీనిపై స్పందించలేదు. ఆ పార్టీ ఇంకా ఎప్పుడు ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.