దశాబ్ధాలుగా నల్గొండ జిల్లావాసులు ఆతృతగా ఎదురుచూస్తున్న శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగ మార్గం పనులు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ సొరంగ మార్గం పనుల గురించి చర్చించి వీటిని పూర్తి చేయడానికి రూ.4,637 కోట్లు మంజూరు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ప్రాజెక్టుని ఎలాగైనా పూర్తిచేసి నల్గొండ జిల్లా ప్రజలకు త్రాగునీరు, జిల్లాలో రైతులకు సాగునీరు అందించాలని పట్టుదలగా ఉన్నారు. ఆయన పట్టుదల, చొరవ కారణంగానే మంత్రి మండలి ఈ ప్రాజెక్టు పనులకు ఇంత భారీగా నిధులు కేటాయించిందని చెప్పవచ్చు.
దీనికి సంబందించి వివరాలు...
• ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులో సొరంగం తవ్వకం పనులు 60 శాతం పూర్తయ్యాక బోరింగ్ యంత్రం పాడయింది. దానికి మరమత్తులు చేయించినప్పటికీ మళ్ళీ పాడవడంతో సొరంగం తవ్వకం పనులు నిలిచిపోయాయి.
• ఇప్పుడు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినందున టన్నల్ బోరింగ్ మెషీన్‌కు అవసరమైన మరమత్తులు చేసి, నెలకు 400 మీటర్ల చొప్పున 2027 సెప్టెంబర్‌నాటికి సొరంగం పనులు పూర్తిచేయాలని కాంట్రాక్ట్ కంపెనీకి గడువు విధించింది.
• సొరంగం మార్గం అందుబాటులోకి వస్తే శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజి నుంచి కూడా పైసా ఖర్చు చేయకుండా గ్రావిటీ పద్దతిలో నీళ్ళు పారుతాయి.
• రోజుకి 4 లక్షల క్యూసెక్కులు చొప్పున ఏడాదికి 30 టీఎంసీలు నీళ్ళు నల్గొండ జిల్లాకు చేరుతాయి.
• తద్వారా జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది.
• నల్గొండ జిల్లాకు త్రాగునీరు లభిస్తే ఫ్లోరైడ్ సమస్యల నుంచి శాశ్వితంగా బయటపడుతుంది.