సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం బోనస్ ప్రకటించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు రూ.4,701 కోట్లు లాభాలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దానిలో 33 శాతం అంటే రూ.796 కోట్లు సింగరేణి కార్మికులకు బోనస్‌గా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ లెక్కన సగటున ఒక్కో కార్మికుడికి సుమారు రూ. 1.90 లక్షలు బోనస్ అందుకుంటారని చెప్పారు. సింగరేణిలో తొలిసారిగా కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా ఒక్కొక్కరికీ రూ.5,000 చొప్పున బోనస్ అందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.
గత ఏడాది కంటే ఈసారి అదనంగా మరో రూ.20,000 బోనస్ లభించబోతుండటంతో సింగరేణి కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాభాలలో 33శాతం బోనస్‌గా ప్రకటించినందుకు సింగరేణి కార్మిక సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
ఆనవాయితీ ప్రకారం సింగరేణి సంస్థ కార్మికులకు బోనస్‌తో పాటు ఒక నెల జీతం పండుగ అడ్వా గా చెల్లిస్తుంటుంది. కనుక నెలనెలా అందే జీతం, ఈ బోనస్, అడ్వాన్స్ కలిపి ఒక్కో కార్మికుడు ఎంతలేదన్నా రూ.3-4 లక్షలు అందుకునే అవకాశం ఉంది.
తమ ప్రాణాలు, ఆరోగ్యం పణంగా పెట్టి బొగ్గు తవ్వి తీసి దేశానికి రాష్ట్రానికి సంపద సృష్టించి ఇస్తున్న సింగరేణి కార్మికులకు ఎంత చెల్లించినా తక్కువే అనుకోవచ్చు. కనుక వారు ఈ బోనస్ వగైరాలకు నూటికి నూరు శాతం అర్హులే.