తెలంగాణకు మరో విమానాశ్రయం ఇంకా ఎప్పుడో?

గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెంది దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలుస్తోంది. కానీ నేటికీ రాష్ట్రం మొత్తానికి ఒకే ఒక్క విమానాశ్రయం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. గత ప్రభుత్వం వరంగల్‌లో మరో విమానాశ్రయం ఏర్పాటుకి కృషి చేసినప్పటికీ, బిఆర్ఎస్-బీజేపీల మద్య రాజకీయాల కారణంగా, మాజీ సిఎం కేసీఆర్‌ కేంద్రంతో కయ్యానికి దిగడంతో వరంగల్‌ విమానాశ్రయం ఏర్పాటుకి అవరోధంగా మారింది. 

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బీజేపీలు కూడా పరస్పరం కత్తులు దూసుకుంటున్నప్పటికీ, సిఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్రమోడీతో సక్యతగా ఉంటూ ఒకటొకటిగా అన్నీ సాధించుకుంటున్నారు. రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. టిడిపికి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కేంద్రమంత్రులుగా ఉన్నారు. వారితో కాంగ్రెస్‌ మంత్రులకు మంచి పరిచయాలు, సత్సంధాలున్నాయి. కనుక వారు ఆ పరిచయాలను వాడుకొని తెలంగాణకు మేలు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఢిల్లీలో పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్‌, అదిలాబాద్ జిల్లా కేంద్రాలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు ప్రక్రియని వేగవంతం చేయాల్సిందిగా కోరారు. 

ఇటీవల తెలంగాణలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి వెళ్ళిన వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ను కలిసి వీలైనంత త్వరగా రాష్ట్రానికి పంట నష్టం పరిహారం అందించాల్సిందిగా కోరారు. తెలంగాణలో కొబ్బరి బోర్డ్ ఏర్పాటు చేయాలని, ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో సెంటర్‌ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. తర్వాత కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌ని కలిసి రాష్ట్రంలో ‘ఫుడ్ ప్రాసెసింగ్‌’ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.