రఘునందన్ రావుకి హైకోర్టు నోటీస్‌ జారీ

ప్రముఖ సినీ నటుడు నాగార్జునకి చెందిన ‘ఎన్‌ కన్వెన్షన్’ కూల్చివేతని సమర్దిస్తూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హైకోర్టుని ఉద్దేశ్యించి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని కోర్టు ధిక్కారంగా పరిగణించి హైకోర్టు ఆయనకు నోటీస్‌ జారీ చేసింది. మీపై ఎందుకు క్రిమినల్ ఛార్జ్ నమోదు చేయకూడదో తెలపాలని దానిలో పేర్కొంది. 

నాగార్జున ‘ఎన్‌ కన్వెన్షన్’ కూల్చివేయడాన్ని తప్పు పడుతూ ట్విట్టర్‌లో ఓ మెసేజ్ పెట్టారు. తాము ‘ఎన్‌ కన్వెన్షన్’ కోసం ఒక్క అంగుళం కూడా చెరువు స్థలాన్ని కబ్జా చేయలేదని, అదో ఓ ప్రైవేట్ స్థలమని పేర్కొన్నారు. అయినా గతంలో జీహెచ్‌ఎంసీ దానిని కూల్చివేసేందుకు వచ్చినప్పుడు తాను హైకోర్టుని ఆశ్రయిస్తే స్టే మంజూరు చేసిందని, కానీ హైడ్రా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ‘ఎన్‌ కన్వెన్షన్’ని కూల్చివేయడం అక్రమమని దానిపై తాను న్యాయపోరాటం చేస్తానని నాగార్జున తెలిపారు. 

నాగార్జున ట్వీట్‌పై రఘునందన్ రావు స్పందిస్తూ, “స్టే ఇస్తే ఆరు నెలలో ఏడాదో అమలులో ఉంటుంది కానీ ఇలా ఏళ్ళ తరబడి స్టే కొనగుతుందా?అయినా ఇంతకాలం ఆ కేసుపై మళ్ళీ విచారణ చేపట్టకుండా హైకోర్టు ఎందుకు ఊరుకుంది? ఏ శక్తులు ఆ కేసు విచారణకు రాకుండా అడ్డుకున్నాయి?ఈ విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరిగిందని నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ హైకోర్టు నన్ను పిలిస్తే నేను తప్పకుండా కోర్టుకి హాజరయ్యి నా వాదనలు వినిపిస్తాను,” అని అన్నారు. 

రఘునందన్ రావు హైకోర్టుని, ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశ్యించి చేసిన ఈ వ్యాఖ్యలు హైకోర్టు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నందున ఆయనపై ఎందుకు క్రిమినల్ కేసు నమోదు చేయకూడదో తెలియజేయాలంటూ హైకోర్టు ఆయనకు నోటీస్‌ పంపింది. దీనిపై రఘునందన్ రావు ఏవిదంగా స్పందిస్తారో?