బిఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయలు జరిమానా

బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర హైకోర్టు లక్ష రూపాయలు జరిమానా విధించింది. నల్గొండలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేనందున దానిని కూల్చివేస్తామంటూ నల్గొండ మునిసిపల్ కమీషనర్‌ ఈ ఏడాది జూలై 20న బిఆర్ఎస్ పార్టీకి నోటీస్‌ ఇచ్చారు. 

ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ దానిని సవాలు చేస్తూ హైకోర్టులో కేసు వేశారు. అయితే ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని హైకోర్టు అప్పుడే సూచిస్తూ ఆ పిటిషన్‌ కొట్టివేసింది. 

కానీ మునిసిపల్ కమీషనర్‌ నుంచి మళ్ళీ నోటీస్‌ రావడంతో రమావత్ రవీందర్ మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టంగా చెప్పిన తర్వాత మళ్ళీ పిటిషన్‌ వేయడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, కోర్టు సమయం వృధా చేసినందుకు ఆయనకు లక్ష రూపాయలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాలలో జిల్లా న్యాయాధికార సేవ సంస్థ ఖాతాలో జమా చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 

బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ జిల్లాలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు రెండు నుంచి మూడు ఎకరాలు చొప్పున ఉదారంగా పార్టీకి కేటాయించుకుంది. ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాల కొరకు నామ మాత్రపు ధరలకు భూములు కేటాయించడం అధికార దుర్వినియోగమే అని భావించవచ్చు. 

అదే తప్పు అనుకుంటే మేమే అధికారంలో ఉన్నామనే ధీమాతో అనుమతులు తీసుకోకుండానే పార్టీ కార్యాలయం నిర్మించుకోవడం మరో తప్పు. దాని కోసం హైకోర్టుకి వెళ్ళడం మూడో తప్పు. కనుక హైకోర్టు తీర్పుని అభినందించాల్సిందే.