తెలంగాణ ఎన్నికల కమీషనర్‌గా రాణీ కుముదిని

తెలంగాణ ఎన్నికల కమీషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రాణీ కుముదిని నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ పేరిట రాజ్‌భవన్‌ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎన్నికల కమీషనర్‌గా చేసిన పార్ధసారధి పదవీకాలం సెప్టెంబర్‌ 8వ తేదీతో ముగిసీఎండీ. కనుక తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు మేరకు ఆయన స్థానంలో రాణీ కుముదిని నియమితులయ్యారు. 

రాణీ కుముదిని 1988 బ్యాచ్‌కి చెందిన అధికారిణి. నిబంధనల ప్రకారం కొన్నేళ్లు కేంద్ర సర్వీసులలో పనిచేసిన తర్వాత రాష్ట్ర సర్వీసులో భాగంగా పలు శాఖలలో పనిచేశారు. చివరిగా తెలంగాణ కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేసి 2023లో ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. 

ఇప్పుడు ఆమెకు కీలకమైన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె పదవీకాలం మూడేళ్ళని ఉత్తర్వులలోనే పేర్కొన్నారు. అంటే ఆమె పదవీకాలాన్ని ప్రభుత్వం పొదిగిస్తే తప్ప వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ఆమె ఈ పదవిలో ఉండకపోవచ్చు. కానీ ఆమె కీలకమైన ఈ పదవి చేపట్టగానే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అవి అధికార, ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకమైనవే కనుక వాటి నిర్వహణ ఆమెకు కత్తి మీద సామువంటివే కావచ్చు.