ఈరోజు ఉదయం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, “తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ, విలీనం దినోత్సవం పేరుతో బిఆర్ఎస్ పార్టీలు అమరుల త్యాగాలపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
తెలంగాణ అమరవీరుల పోరాట స్పూర్తితో ఓ నియంత (కేసీఆర్) పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాపాలన సాగుతోంది. కనుక ఏటా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ కోసం పోరాడిన ఆ అమరవీరులను స్మరించుకొని ప్రజాపాలన దినోత్సవం జరుపుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తాను కేసీఆర్‌లాగా ఫామ్‌హౌస్‌లో కూర్చొని పరిపాలన చేసే ముఖ్యమంత్రిని కానని ప్రజలమద్య ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తానన్నారు.
ఈ సందర్భంగా హైడ్రాని అడ్డుకునేందుకు జరుగుతున్న రాజకీయ కుట్రలు, ప్రభుత్వంపై వస్తున్న ఒత్తిళ్ళని ప్రస్తావిస్తూ, “హైదరాబాద్ నగరం కూడా కేరళలో వయనాడ్ మాదిరిగా నష్టపోకూడదనే హైడ్రా ఏర్పాటు చేశాము తప్ప ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యమూ లేదు. దీని వలన మా ప్రభుత్వంపై చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి. కానీ హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవడం కోసం వాటన్నిటినీ తట్టుకొంటూ ముందుకే సాగాలని నిర్ణయించాము,” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.