గణేశ్ నిమజ్జనాల హడావుడిలో విమోచన దినోత్సవం కానరాలేదే

ఏటా నేడు (సెప్టెంబర్‌ 17) తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బిఆర్ఎస్-బీజేపీల మద్య రాజకీయాలు జరుగుతుండేవి. కానీ ఇవాళ్ళ హైదరాబాద్‌ నగరం అంతటా గణేశ్ నిమజ్జనాలతో సందడిగా ఉండటంతో తెలంగాణ విమోచన దినోత్సవం ఊసే పెద్దగా వినబడలేదు.

బీజేపీ అధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌, సీనియర్ నేత లక్ష్మణ్, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 

గత ఏడాది తెలంగాణ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యి బిఆర్ఎస్ పార్టీపై నిప్పులు కురిపించారు. కానీ ఈసారి “హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ ముక్తి సంగ్రామం ఎల్లప్పుడు దేశభక్తికి అద్భుతమైన ప్రతిబింబంగా పేర్కొనబడుతుంది.

ఇక్కడి ప్రజలు నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించి భారతదేశంలో ఐక్యమవడానికి అపారమైన బాధలను భరించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచనోద్యమ అమరవీరులకు నా నివాళులు,” అని ట్వీట్‌తో సరిపెట్టారు. 

కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ల ప్రసంగాలు కూడా రొటీన్‌గానే సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు.

నేడు ‘ప్రజా పాలన దినోత్సవం’పేరుతో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం టాంక్ బండ్‌ చేరుకొని గణేశ్ నిమజ్జనాలను చూసి, ప్రజలతో పారిశుధ్య సిబ్బంధి, సామాన్య ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.