ఒట్టేసి చెపుతున్నా: కేటీఆర్‌

తెలంగాణ సచివాలయం ఎదుట దివంగత ప్రధాని విగ్రహం ఏర్పాటు చేస్తుండటంపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి తీవ్రంగా స్పందించారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టిస్తే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి గాంధీ భవన్‌కి పంపిస్తాము.

రేవంత్‌ రెడ్డికి రాజీవ్ గాంధీ మీద అంత అభిమానమే ఉంటే జూబ్లీహిల్స్‌లో తన ఇంటి ఆవరణలో పెట్టుకోమనండి. అంతేకానీ తెలంగాణ తల్లి విగ్రహం విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టిస్తే మేము అంగీకరించబోము,” అని అన్నారు. 

ఇదివరకు ఇదే అంశంపై స్పందిస్తూ, “మేము అధికారంలోకి వచ్చిన గంటలోగా సచివాలయం చుట్టూ ఉన్న చెత్తని తొలగించేస్తాము,” అంటూ రాజీవ్ గాంధీ విగ్రహం గురించి అనుచితంగా మాట్లాడారు. దాంతో కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడి చేయడంతో కేటీఆర్‌ వెనక్కు తగ్గి, ఇప్పుడు ‘సకల మర్యాదలతో’ అంటున్నారు. 

అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు విగ్రహాలు ఏర్పాటు చేసి ఏదో ఘనకార్యం చేశామని ప్రజలను భ్రమింపజేస్తాయి. కానీ ప్రభుత్వం మారగానే ఆ విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. ఈవిదంగా జరుగుతుందని తెలిసి ఉన్నప్పుడు, అందరికీ ఆమోదం కానీ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయకపోవడమే మంచిది కదా?