విద్యుత్, మంచినీళ్ళు, చెత్తపన్ను వగైరాలన్నీ నెలనెలా వసూలు చేస్తున్నట్లే ఇకపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తి పన్నులు కూడా నెలనెలా వసూలు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు మునిసిపల్ శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
ఆరు నెలలకోసారి ఆస్తిపన్ను వలన అటు ప్రజలపై భారం పెరిగి ఆ కారణంగా చాలామంది సకాలంలో కట్టకపోవడంతో వారికీ ఆ భారం పెరుగుతుంది. మునిసిపల్ శాఖకి ఆ మేరకు ఆదాయం లేకుండా పోతోంది. కనుక ఆస్తిపన్నుని కూడా నెలనెలా వసూలు చేస్తే ఈ సమస్యని అధిగమించవచ్చని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
వార్షిక ఆస్తి పన్ను రూ.1,200ల లోపు ఉన్నట్లయితే రూ.101 చెల్లిస్తే చాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్వినియోగం అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ విధానంలో లోపాలను సరిదిద్దాలని సిఎం రేవంత్ రెడ్డి జీహెచ్‌ఎంసీ కమీషనర్ ఆమ్రపాలిని ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రజల నుంచి చెత్తపన్ను వసూలు చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు చెత్త తొలగించడం లేదనే పిర్యాదులు వస్తూనే ఉన్నాయి. పైగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చెత్తపన్ను ఉంటోంది. కనుక చెత్తపన్నుకి నిర్ధిష్టమైన ఛార్జి నిర్ణయించి, ఎప్పటికప్పుడు చెత్త తొలగించేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
టంచనుగా ఆస్తిపన్ను, విద్యుత్ బిల్లులు వగైరా చెల్లిస్తున్న ప్రజలకు ఏడాది చివరిలో రాయితీలు లేదా బహుమతులు అందజేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.