హైడ్రా కమీషనర్‌గా రంగనాథ్ ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం ఆరు వారాలలోగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తుంది. ఆలోగా హైడ్రా కోసం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది.
దీని కోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబందించి ఆర్డినెన్స్ కి ఆమోదముద్ర వేస్తుంది. ఆర్డినెన్స్ జారీ చేస్తే వివిద శాఖలకు సంబందించి అధికారాలు, పరిధి హైడ్రాకి బదిలీ చేయబడతాయి.
కనుక ఆర్డినెన్స్ తర్వాత హైడ్రాకి విశేషాధికారాలు లభిస్తాయి. రాజధాని హైదరాబాద్ నగరంలో చెరువులు, కాలువలు, మూసీనది మొదలైన వాటన్నిటినీ కబ్జాల నుంచి విడిపించడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుంది తప్ప రాజకీయాల కోసం కానే కాదు. కనుక హైడ్రా కూల్చివేతలకి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాను,” అని కమీషనర్ రంగనాధ్ చెప్పారు.
హైడ్రా కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 99ని రద్దు చేసేందుకు, హైడ్రా కూల్చివేతలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. కానీ హైడ్రాకి చట్టబద్దత, నిర్ధిష్టమైన నియమ నిబంధనలు లేకపోవడాన్ని తప్పు పట్టింది. హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూనే మరింత శక్తివంతంగా మార్చబోతోంది. కనుక ఆక్రమణదారులకు ఇది చాలా చేదు వార్తే అని చెప్పక తప్పదు.