బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆంధ్ర సెటిలర్స్ మనోభావాలు దెబ్బతినేవిదంగా మాట్లాడి పార్టీకి నష్టం కలుగజేస్తే, అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగివచ్చిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించడంలో హద్దు మీరడం విస్మయం కలిగిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఓ అసమర్ధుడు చేతిలో పడి నలిగిపోతోందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియా హెడ్ లైన్స్ మేనేజ్ చేస్తూ, ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
మా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ళకు వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుకొని కాంగ్రెస్లో చేర్చుకుని, మేము గేట్లు ఎత్తేస్తే బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల హైకోర్టు తీర్పు చెప్పగానే రేవంత్ రెడ్డి కూడా మాట ఫిరాయించి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ పార్టీలో చేరిన మా ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డిని ఎదిరిస్తే అనర్హత వేటు వేయిస్తారని భయపడుతున్నారు.
హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రత్యర్ధులపై ఒత్తిళ్ళు తెస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. చరిత్రలో ఇంత అసమర్దుడైన మరో ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేము. రేవంత్ రెడ్డి ఓ చిట్టి నాయుడు. ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నా పోలీసులను, అధికారులను ఎవరినీ వదిలిపెట్టము. అందరినీ కోర్టుకీడ్చుతాము.
పదేళ్ళ మా పాలనలో ఎన్నడూ ప్రాంతీయతత్వం , విభేధాలు లేవు. కానీ ఇప్పుడు ఈ సిఎం పాలనలో అటువంటివి మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా బిఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు. పోరాడుతూనే ఉంటాము,” అని అన్నారు.