ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల వలన తెలంగాణ రాష్ట్రానికి రూ.10,320 కోట్లు పైనే నష్టం జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వివిద శాఖల నుంచి ఇంకా నివేదికలు రావలసి ఉందని అవి కూడా వస్తే ఎంత నష్టం జరిగిందో తెలుస్తుందన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సలహాదారు కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఢిల్లీ నుంచి వచ్చి రెండు రోజులపాటు వరద ముంపుకి గురైన మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పర్యటించారు.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సిఎస్ శాంతి కుమారి తదితరులు శుక్రవారం వారితో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి వారికి వరద నష్టాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న ఆర్ధిక, ఇతర సహాయ సహకారాలు, వాటిని పొందడంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల గురించి వివరించి, ఎటువంటి నిబంధనలు విధించకుండా అత్యవసరంగా రాష్ట్రానికి రూ.10,320 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న కొన్ని ముఖ్య విషయాలు...
• ఎస్‌డీఆర్ఎఫ్ పద్దులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.1,350 కోట్లు కేటాయించినప్పటికీ కొన్ని నిబంధనల కారణంగా దానిలో నుంచి ఒక్క రూపాయి తీసి వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. కనుక ఆ నిబంధనలని తొలగించాలి.
• మున్నేరు వాగు సమస్యకి శాశ్విత పరిష్కారం రీటేయింగ్ వాల్ నిర్మించడం ఒక్కటే. దానికి అవసరమైన నిధులు కేంద్రం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా భరించేందుకు సిద్దంగా ఉంది.
• ముంపు ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన ప్రదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. వాటికి కేంద్ర ప్రభుత్వం పధకం ద్వారా అవసరమైన నిధులు విడుదల చేయాలి.
• పర్యావరణ మార్పులు, ఇటువంటి ప్రకృతి విపత్తుల గురించి కేంద్రం రాష్ట్రానికి ముందే సమాచారం అందించేందుకు అవసరమైన వ్యవస్థ లేదా యంత్రాంగం ఏర్పాటు చేయాలి.
• దేశంలో మొట్టమొదటిసారిగా ములుగు జిల్లాలో సుడిగాలికి 50 వేల ఎకరాలలో లక్షల చెట్లు కూలిపోవడం పెను ఉపద్రవంగా పరిగణించి, దీనిపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు చూపేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలి.