హైడ్రా కూల్చివేతలపై బాధితులు, బిఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు చెపుతున్నప్పటికీ ప్రభుత్వం, హైడ్రా రెండూ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇటీవల అమీన్పూర్లో విల్లాలని కూల్చివేయడంతో, డి.లక్ష్మి అనే ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ వేశారు.
చట్ట బద్దత లేని హైడ్రాకి ప్రభుత్వం విశేష అధికారాలు కల్పించడం తప్పని, హైడ్రా ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్ళు కూల్చివేయడం సరికాదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కనుక హైడ్రా ఏర్పాటుకి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 99ని రద్దు చేసి, హైడ్రా కూల్చివేతలపై స్టే విధించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఆమె పిటిషన్పై హైకోర్టు జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, హైడ్రా ఏర్పాటుకి జారీ చేసిన జీవో 99ని రద్దు చేయలేమని, కూల్చివేతలపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
అయితే హైడ్రా ఏర్పాటుకి ప్రభుత్వం జారీ చేసిన జీవో 99 లోపభూయిష్టంగా ఉందని, జీహెచ్ఎంసీ నియమ నిబందనలను పట్టించుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రాకి చట్టబద్దత కల్పించకుండా విశేషాధికారాలు కల్పించడం కూడా సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
హైడ్రా ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, యాజమాన్య హక్కులను ధృవీకరించే పత్రాలను పరిశీలించకుండా ఇళ్ళని కూల్చివేయడం సరికాదని పేర్కొంది. కనుక ఇకపై నియమ నిబంధనల ప్రకారమే ముందుకు సాగాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణని ఈ నెల 19కి వాయిదా వేసింది.