పాతనోట్ల రద్దుపై డిల్లీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మళ్ళీ రూ.500, 2000 నోట్లని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. దీనిపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు. కానీ జగన్ మనసాక్షి సాక్షి మీడియాలో కేసీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది.
మోడీ నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడుతున్నారని, దాని వలన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తారుమారు అయ్యిందని, సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పరిస్థితి ఇలాగే మరికొంత కాలం కొనసాగినట్లయితే ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం ఖాయం అని కేసీఆర్ తన సన్నిహితులతో అన్నారని నేటి సాక్షి సంచికలో ఒక వార్త ప్రచురించింది. అది ఒక దిక్కుమాలిన నిర్ణయం, దాని వలన దేశం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడినట్లు పేర్కొంది. కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించకుండా, వాటికి తెలియజేయకుండా ఏకపక్షంగా ఇటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం చాలా తప్పని కనీసం ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యి దీనిపై చర్చించిన తరువాత నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని, కేసీఆర్ అభిప్రాయపడినట్లు పేర్కొంది. ఈ కారణంగా రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తెరాస సర్కార్ వేసుకొన్న ప్రణాళికలన్నీ తారుమారు అయిపోయాయని ఆయన బాదపడ్డారని సాక్షి పేర్కొంది. కనుక త్వరలోనే డిల్లీ వెళ్ళి నోట్ల రద్దు తదనంతర పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సాక్షి పేర్కొంది.
నోట్ల రద్దు వలన తెరాస సర్కార్ బారీగా ఆదాయం కోల్పోయిందని కానీ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకించడంలేదని రెండు రోజుల క్రితమే ఆయన కుమారుడు మంత్రి కేటిఆర్ మీడియాకి చెప్పారు. కానీ సాక్షి మీడియా అందుకు పూర్తి భిన్నంగా చెపుతోంది. ఇంతకీ నోట్ల రద్దుపై జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ఏమిటో ఇంతవరకు చెప్పనే లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెపితే ఇటువంటి అపోహలు, ఊహాగానాలకి అవకాశం ఉండదు.