కేంద్ర ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరుని శ్రీ విజయపురంగా మార్చింది. వలస పాలనలో ఏర్పాటు చేసిన పేర్లు, గుర్తుల స్థానంలో భారతీయత పేర్లు, చిహ్నాలు ఉపయోగించాలని ప్రధాని నరేంద్రమోడీ ఆశయానికి అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరుని శ్రీ విజయపురంగా మార్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
నాటి చోళ రాజుల కాలంలో ఇక్కడ నౌకాదళ స్థావరం ఉండేదని, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటి సారిగా ఇక్కడే జాతీయ జెండా ఎగురవేశారని అమిత్ షా పేర్కొన్నారు. భారత్ స్వాతంత్ర పోరాటంలో అండమాన్ నికోబార్ దీవులు చాలా కీలకపాత్ర ఉందని, వీర సావర్కర్ వంటి అనేకమంది స్వాతంత్ర్య సమర యోధులు త్యాగాలను గుర్తుచేసే సెల్యులార్ జైలు ఇక్కడే ఉందని కనుక పోర్ట్ బ్లెయిర్ పేరుని శ్రీ విజయపురంగా మార్చడం సబబుగా భావిస్తున్నామని ట్వీట్ చేశారు.