బెయిల్‌పై అర్వింద్ కేజ్రీవాల్‌ విడుదల

లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ శుక్రవారం సాయంత్రం బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు ఆమాద్మీ పార్టీ నేతలు, మంత్రులు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌, ఆమాద్మీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికి ఇంటికి తోడ్కొని పోయారు. 

ఈ సందర్భంగా అర్వింద్ కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ, “నన్ను ఓ తప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెట్టి నా మనోధైర్యాన్ని దెబ్బ తీయాలనుకున్నారు. కానీ భగవంతుడు దయ వలన నా ఆత్మస్థైర్యం 100 రెట్లు పెరిగింది.

కులమతాలు, ప్రాంతాల పేరుతో దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్న శక్తులతో పోరాడుతూనే ఉంటాను. నేను నమ్మిన సిద్దాంతాల ప్రకారం నడుచుకుంటూ దేశానికి నావంతు సేవ చేస్తాను. ఎల్లప్పుడూ సత్యమార్గంలో పయనిస్తుండటం వలననే నాకు ఆ భగవంతుడి ఆశీసులు, ఇంత మనో ధైర్యం లభించాయని భావిస్తున్నాను. నా ఈ కష్టకాలంలో మాకు అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.