రేవంత్ రెడ్డి సూటి ప్రశ్నలు... సమాధానాలు ఉన్నాయా?

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మద్య గొడవలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. “ఫిరాయింపులపై న్యాయస్థానం తీర్పుని స్వాగతిస్తున్నాను. దాంతో చివరికి కాంగ్రెస్ పార్టీకే మేలు కలుగుతుందని చెప్పగలను. మా ప్రభుత్వాన్ని పడగొడతామని బిఆర్ఎస్ నేతలు బెదిరించబట్టే ఈ ఫిరాయింపు మొదలయ్యాయనే సంగతి వారు మరిచిపోయిన్నట్లున్నారు. 

పీఏసీ కమిటీ ఛైర్మన్‌ పదవి గురించి బిఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ పదవి ఇవ్వకుండా కేవలం ఏడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న మజ్లీస్‌కి ఇచ్చింది కదా? 

బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళు మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు కదా?అప్పుడు తప్పుగా అనిపించనప్పుడు, ఇప్పుడు మేము బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఆ పదవి ఇస్తే ఎందుకు తప్పు పడుతోంది? అయినా శాసనసభ సమావేశాలు ముగిసేటప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యని ప్రకటించినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? 

అరికెపూడి గాంధీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ‘బ్రతకడానికి వచ్చినోడిగా’ కనపడలేదు. కానీ పార్టీ వీడేసరికి ‘బ్రతకడానికి వచ్చినవాడని’ అంటున్నారు. బ్రతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లు కావాలి వాళ్ళకు గౌరవం ఇవ్వకూడదా?

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ‘బ్రతకడానికి వచ్చినోళ్ళు’ అంటూ ఆంధ్రా ప్రజలని చులకన చేసి మాట్లాడినందుకు కేసీఆర్‌ కుటుంబం వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.