ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మద్య చిన్నగా మొదలైన వాగ్వాదాలు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్ళాయి. ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో కలిసి కార్లలో పాడి కౌశిక్ రెడ్డికి బయలుదేరగా దారిలో నార్సింగి పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆయనని సుమారు 5 గంటలసేపు పోలీస్ స్టేషన్‌లో కూర్చో బెట్టి తర్వాత ఆయనకి సెక్షన్ 35(3) బిఎన్‌ఎస్ ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించేశారు.
ఆయన పోలీస్ స్టేషన్‌లో ఉండగానే ఆయన అనుచరులు కొంతమంది తన ఇంటిపై రాళ్ళతో దాడి చేశారని, ఇది తనపై హత్యాప్రయత్నమే అని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తమ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసినందుకు నిరసనగా హరీష్ రావుతో సహా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
అరికెపూడి గాంధీపై ఎటువంటి కేసు నమోదు చేయకుండా పోలీసులు విడిచిపెట్టడాన్ని నిరసిస్తూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. పోలీసులు తక్షణం గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అంతవరకు అక్కడి నుంచి కదలమని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు భీష్మించుకుని కూర్చున్నారు.
పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా వినకపోవడంతో అందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులున్నారు. తమ ఎమ్మెల్యేపై దాడి చేసిన వారిని విడిచిపెట్టి తమని అరెస్ట్ చేయడాన్ని బిఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు.