పాడి కౌశిక్ రెడ్డి ఓ పోలిటికల్ బ్రోకర్: అరికెపూడి గాంధీ

ఈరోజు ఉదయం 11 గంటలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వచ్చి ఆయనకి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి, ఇంటిపై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తానని బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు చేశారు. దానికి గాంధీ కూడా ధీటుగా స్పందిస్తూ దమ్ముంటే రమ్మనమని లేకపోతే నేనే నీ ఇంటికి వస్తానని ప్రతి సవాలు విసిరారు. 

అరికెపూడి గాంధీ తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “పాడి కౌశిక్ రెడ్డి ఓ పోలిటికల్ బ్రోకర్. తనని బిఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అనేకమందిని వేట తీసుకువస్తానని చెప్పి ఆ పార్టీలో చేరి చీడపురుగులా బిఆర్ఎస్‌ పార్టీని నాశనం చేశాడు. 

నేను శేరిలింగంపల్లి నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికలలో గెలిచాను. కానీ పాడి కౌశిక్ రెడ్డి తనను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రజలని బ్లాక్ మెయిల్ చేసి గెలిచాడు. అటువంటి వ్యక్తా నాకు సవాలు విసిరేది?

నేను ఇక్కడే నా ఇంట్లోనే ఉన్నాను. దమ్ముంటే వచ్చి నా ఇంటిపై బిఆర్ఎస్‌ పార్టీ జెండా ఎగరేయి. లేకపోతే నేనే నీ ఇంటికి వస్తాను,” అని సవాలు విసిరారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్‌లో చేరిన బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఇద్దరి ఇళ్ళవద్ద భారీగా పోలీసులు మోహరించారు.