శేరిలింగంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడం తెలిసిందే. ఆనవాయితీ ప్రకారం ఆ పదవి ప్రధాన ప్రతిపక్షపార్టీ నాయకుడుకి ఇవ్వాలి కనుక అరికెపూడి గాంధీ ఆ పదవి చేపట్టేతప్పుడు తాను బిఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య ఈ అంశంపైనే విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ, “గాంధీగారు మీరు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకున్నారు. కనుక రేపు ఉదయం 11 గంటలకి నేను మీ ఇంటికి వచ్చి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతాను. ఆ తర్వాత మనం మీ ఇంటి మీద బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి నేరుగా మన పార్టీ కార్యాలయానికి వెళ్ధాము. అక్కడ ప్రెస్‌మీట్ పెట్టి మీరు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెపుదాము. సిద్దంగా ఉండండి,” అని అన్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ అభ్యంతరాలకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సరైన సమాధానం చెప్పారనుకుంటే, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఈ మెలిక పెట్టి కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టింది. దీనిపై అరికెపూడి గాంధీ ఎలా స్పందిస్తారో?
(video courtecy: Telugu Scribe)