సిఎం రేవంత్‌ రెడ్డితో పవన్‌ కళ్యాణ్‌ భేటీ

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నేడు హైదరాబాద్‌ వచ్చి  తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డిని జూబ్లీహిల్స్‌ నివాసంలో కలిశారు. తెలంగాణ వరద బాధితుల సహాయార్ధం పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసి ఆ చెక్కుని స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల రాజకీయాలపై కాసేపు మాట్లాడుకున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉండటంతో రాష్ట్రంలో ఒక్కో పంచాయితీకి లక్ష రూపాయలు చొప్పున మరో నాలుగు కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే వరద బాధితుల కోసం పవన్‌ కళ్యాణ్‌ ఒక్కరే మొత్తం రూ.6 కోట్లు విరాళం ఇచ్చారన్న మాట!  

రెండు నెలల క్రితం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ వచ్చి ప్రజా భవన్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్యలపై వారు చర్చించారు. ముందుగా రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు సమావేశమయ్యి  చర్చించి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులకు తెలియజేస్తారు. వారు ఆమోదిస్తే ఆ సమస్య పరిష్కారానికి తదుపరి చర్యలు చేపడతారు.