గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌

హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని, పీఓపీ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ చెరువుల్లోనే నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది.

పీఓపీ విగ్రహాల తయారీపై ఎటువంటి నిషేదం లేనందున ఆ విగ్రహాలను తయారుచేస్తున్న వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 

హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనాలపై అభ్యంతరం చెపుతూ వేణు మాధవ్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

మూడేళ్ళుగా హుస్సేన్ సాగర్‌లో పీఓపీ గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరుగుతుండటం కోర్టు ధిక్కారమే అని వాదిస్తున్నప్పుడు అప్పుడే వెంటనే ఎందుకు పిటిషన్‌ వేయలేదు?మూడేళ్ళ తర్వాత నిమజ్జనాలకు ముందు ఈ పిటిషన్‌ ఎందుకు వేసిన్నట్లు?

ఒకవేళ హుస్సేన్ సాగర్‌లో పీఓపీ గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు జరుగుతున్నట్లయితే, వాటి ఫోటోలు, సాక్ష్యాధారాలు ఈ పిటిషన్‌లో ఎందుకు జత చేయలేదు?గత ఏడాది న్యాయస్థానం ఈ వ్యవహారంపై తీర్పు ఇచ్చినప్పుడు హైడ్రా లేనప్పుడు దానిని ప్రతివాదిగా ఎలా చేర్చమని అడుగుతారు? అని ప్రశ్నల వర్షం కురిపించి కోర్టు ధిక్కార పిటిషన్‌ కొట్టివేసింది.