కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు ఖరారు

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రవీంద్ర భారతిలో ఆమె పోరాటాలను తెలియజేస్తూ ఓ నృత్యరూపకం ప్రదర్శన జరిగింది. ఆ కార్యక్రమానికి సిఎం రేవంత్‌ రెడ్డి మంత్రులు తదితరులు హాజరయ్యారు. 

అనంతరం సిఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తూ, “చాకలి ఐలమ్మ వంటి తెలంగాణ పోరాట యోధులు, మహనీయుల పోరాటాలు, త్యాగాలు భవిష్యత్‌ తరాలకి కూడా తెలియజేసేందుకు వివిద సంస్థలకి, ప్రభుత్వ భవనాలకు వారి పేర్లను పెట్టుకుంటున్నాము. 

ఐఐహెచ్‌టికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాము. ప్రజాభవన్‌కు జ్యూతీరావు ఫూలే పేరు పెట్టుకున్నాము. అదేవిదంగా నా మంత్రివర్గ సహచరుల అనుమతితో కోఠి వద్ద గల తెలంగాణ మహిళా యూనివర్సిటీకి తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నాము. చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేత ఐలమ్మని మహిళా కమీషన్‌ సభ్యురాలిగా నియమిస్తున్నాను. 

దశాబ్ధాల క్రితం బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అసైన్డ్ భూములిస్తే గత ప్రభుత్వం ‘ధరణి’తో వాటన్నిటినీ బలవంతంగా గుంజుకుంది. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో వాటన్నిటినీ వెనక్కు తీసుకొని మళ్ళీ వారికే అప్పగిస్తాము,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.