తెరాస సర్కార్ కి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్నలు

బెల్లం చుట్టూ ఈగలు ముసరడం ఎంత సహజమో అధికార పార్టీ చుట్టూ ప్రతిపక్ష పార్టీలలో అవకాశవాదులు మూగడమూ అంతే సహజమే. పైగా తెరాస అధినేత కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో వాటిపై ఆకర్ష మంత్రం ప్రయోగించడంతో చాలా మంది ఫిరాయించారు. 

ఇంతవరకు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలే అధికార తెరాస పార్టీలో చేరుతుండేవారు. కానీ ఎన్నో ఆశలతో అధికార పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు, గౌరవం దక్కకపోవడంతో అప్పుడప్పుడు కొందరు నేతలు మళ్ళీ వెనక్కి తిరిగివస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన వాసు, రవికుమార్ మరికొందరు కార్యకర్తలు తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. వారివురు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో కేటిఆర్ జంట నగరాల అభివృద్ధి కోసం 100 రోజులు ప్రణాళికని ప్రకటించారని కానీ ఇంతవరకు అది అమలుకి నోచుకోలేదని విమర్శించారు. నేటికీ హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ప్రజల కష్టాలు పట్టించుకొనే నాధుడే కనబడటం లేదని అన్నారు. తండ్రికొడుకులు ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలని మభ్యపెడుతూ కాలక్షేపం చేసేస్తున్నారని, అధిప్రజలు కూడా గ్రహించారని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రమంతా రోడ్లు బాగుచేయలేకపోయినా కనీసం హైదరాబాద్ జంట నగరాలలో రోడ్లనైనా ఎందుకు బాగు చేయలేకపోతున్నారు?ఇంకా ఎప్పుడు బాగు చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.