ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు

కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసుపై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ విజయ్‌ సేన్‌ రెడ్డి, “పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేస్తే హైకోర్టు జోక్యం చేసుకోకూడదనే వాదనలు సరికాదు. వాటిపై స్పీకర్‌ 5 ఏళ్ళు నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టు పట్టించుకోకుండా ఉండాలా?

అనర్హత పిటిషన్లపై ఇరుపక్షాలు దస్త్రాలు, వినతి పత్రాలు సమర్పించేందుకు, తమ వాదనలు వినిపించేందుకు శాసనసభ కార్యదర్శి నాలుగు వారాలలో షెడ్యూల్ రూపొందించి స్పీకర్‌ ముందుంచాలి. ఒకవేళ అలా చేయని పక్షంలో ఈ కేసుని హైకోర్టు సుమోటోగా స్వీకరించి ఆదేశాలను జారీ చేయాల్సి వస్తుంది,” అని తీర్పు చెపుతూ అనర్హత పిటిషన్లన్నిటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 

బిఆర్ఎస్‌ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ,  ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారందరిపై స్పీకర్‌ అనర్హత వేటువేయాలని బిఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు నాలుగు వారాలలో వాటిపై స్పీకర్‌ విచారణ ప్రారంభించాలని హైకోర్టు గడువు విధించింది కనుక ఒకవేళ స్పీకర్‌ ఆలస్యం చేస్తే మళ్ళీ హైకోర్టుని ఆశ్రయిస్తామని బిఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది.