దుండిగల్లో విల్లాలు కూల్చివేస్తున్న హైడ్రా

హైడ్రా కూల్చివేతలపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ, ప్రభుత్వం, హైడ్రా రెండూ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఆదివారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో కత్వ చెరువు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన ఇండిపెండెంట్ ఇళ్ళని హైడ్రా కూల్చివేస్తోంది. 

కత్వ చెరువు పూర్తి విస్తీర్ణం 142ఎకరాలు కాగా, ఆ సర్వే నెంబర్ 170/1 మల్లంపేట్‌లో లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ అనే నిర్మాణ సంస్థ 2020-21 సంవత్సరాలలో 320 విలాలు నిర్మించింది. అయితే వాటిలో 60 విల్లలకు మాత్రమే హెచ్ఎండీఏ అనుమతి తీసుకొని మిగిలిన వాటిని అనధికారంగా నిర్మించిన్నట్లు గుర్తించి మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ హరీష్ విచారణకు ఆదేశించారు. 

వాటిలో 208 విల్లాలు అక్రమ కట్టడాలని నిర్ధారించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై దాఖలైన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఆ విల్లలన్నిటి రిజిస్ట్రేషన్స్, తక్షణం నిలిపివేయాలని, బ్యాంకు లోన్లు మంజూరు చేయరాదని, అప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాటికి కీ నీళ్ళు, విద్యుత్ కనెక్షన్స్ నిలిపివేయాలని ఆదేశించింది. 

కానీ ఆ తర్వాత రాజకీయ ఒత్తిళ్ళు రావడంతో దుండిగల్ మునిసిపాలిటీ ఆ అక్రమ విల్లాలన్నిటికీ రెట్టింపు పన్ను వేసి అన్ని సౌకర్యాలు పునరుద్దరించింది. వాటినే హైడ్రా ఇప్పుడు కూల్చివేస్తోంది. ఇప్పటి వరకు 8 విల్లాలను కూల్చివేసింది. దీంతో కోట్లు పెట్టి వాటిని కొనుగోలు చేసినవారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.