భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వోద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు.
మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డిని అక్కడే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వోద్యోగ సంఘాల నేతలు కలిసి ఈ మేరకు లేఖ అందించారు. వారి ఒకరోజు మూలవేతనం సుమారు రూ.130 కోట్లు.
అక్టోబర్ నెలలో ప్రభుత్వోద్యోగులకు చెల్లించబోయే సెప్టెంబర్ నెల జీతాల నుంచి ప్రభుత్వం దానిని మినహాయించుకొని వరద బాధితులకు, సహాయ పునరావాస కార్యక్రమాలకు వినియోగించాలని ఉద్యోగ సంఘాల నేతలు సిఎం రేవంత్ రెడ్డిని కోరారు.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.
సిఎం రేవంత్ రెడ్డిని కలిసినవారిలో ఉద్యోగ సంఘాల నేతలు మారాం జగదీశ్వర్, మధుసూధన్ రెడ్డి, ఏలూరి శ్రీనివాసరావు, సదానంద్ గౌడ్, శ్యామ్, పింగిలి శ్రీపాల్ రెడ్డి, మనిపాల్ రెడ్డి, కటకం రమేశ్, వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్, మట్టపల్లి రాధాకృష్ణ, ముజీబ్, సత్యనారాయణ, లింగారెడ్డి, పార్వతి సత్యనారాయణ తదితరులున్నారు.