ఇక అన్ని జిల్లాలలో హైడ్రా: రేవంత్‌ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, మహబూబాద్ జిల్లాలలో వరద పరిస్థితులపై సిఎం రేవంత్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ జిల్లాలు, నియోజకవర్గాలలో ఉంటూ సహాయచర్యలలో పాల్గొనాలని సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. 

వరదలతో రాష్ట్రంలో పలు జిల్లాలు అతలాకుతలం అవడంతో సిఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురవడం వలననే పట్టణాలు, పల్లెలు నీట మునుగుతున్నాయని కనుక ఇక నుంచి ప్రతీ జిల్లాలో ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రా వంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. చెరువులు, కాలువల ఆక్రమణలు తొలగించి వరద నీటికి దారి చూపిస్తే ఈవిదంగా ఏటా ముంపు సమస్యలు రాకుండా నివారించవచ్చని సిఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

మహబూబాద్ జిల్లాలో 30 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులకు ఏకరాకు రూ.10వేలు చొప్పున నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. జిల్లాలో నలుగురు చనిపోయారని వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. 

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ వరద బాధితులని పరామర్శించి ధైర్యం చెప్పలేదు. కానీ తాను ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే వచ్చి వారికి అండగా నిలబడతానని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. తాను చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉంటానని, చేయగలిగేవే చెపుతానని అన్నారు.  

ప్రస్తుతం అమెరికాలో హాయిగా కాలక్షేపం చేస్తున్న హరీష్ రావు, వరద బాధితులకి సాయం అందడం లేదంటూ  సోషల్ మీడియాలో మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారని సిఎం రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.