తెలంగాణలో ఎప్పుడు వరదలు వచ్చినా ఏదో ఓ పంప్ హౌస్ నీట మునగాల్సిందే అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇదివరకు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయి వందల కోట్లు నష్టం జరుగగా, ఈసారి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం పంప్ హౌస్ నీట మునిగింది. దానిలో మొత్తం 10 మోటాలు బిగించాల్సి ఉండగా 4 బిగించడం పూర్తయింది. ఆ నాలుగు మోటర్లు వరద నీటిలో మునిగిపోయాయి.
కానీ వరద నీటిలో మోటర్లు మునిగిపోయినా ఎటువంటి నష్టమూ జరుగదని నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ రెడ్డి చెప్పారు.
ప్రస్తుతం వరద నీటిని తోడి బయటకు పంపిస్తున్నామని, తర్వాత మోటర్లని పరిశీలిస్తామని చెప్పారు. భారీ వర్షాలతో నాగర్‌కర్నూల్ జిల్లాలోని తూడికుర్తి, శ్రీపురం, నాగనూల్ గొలుసుకట్టు చెరువులు నిండిపోయి పొంగి ప్రవహించడంతో సమీపంలో గల సొరంగమార్గం ద్వారా సర్జిపూల్‌లోకి వచ్చేశాయని విజయ్ భాస్కర్ రెడ్డి చెప్పారు.