తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందే హెచ్చరిస్తూ వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ కనీవినీ ఎరుగనివిదంగా ఇంతగా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. లక్షల ఎకరాలలో పంటలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వరద నీరు ఊళ్ళని ముంచెత్తింది.
ఖమ్మం నగరంలో రామన్నపేట, పద్మావతీనగర్, వేంకటేశ్వర నగర్ ఇంకా పలు కాలనీలలో ఇళ్ళు నీట మునిగాయి. పాలేరు నియోజకవర్గం, రూరల్ మండలంలో పలు ఇళ్ళు కూలిపోగా అనేక ఇళ్ళపై రేకులు ఎగిరిపోయాయి. ముదిగొండ, మదిర, ఎర్రుపాలెం గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు సర్వస్వం కోల్పోయారు.
వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినందున అధికారులు ముందే వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ వరద ఉదృతి సామాన్య ప్రజలు సర్వస్వం కోల్పోయారు.
ఖమ్మం జిల్లా మున్నేరు నది పరీవాహక ప్రాంతాలలో వందలాది ఇళ్ళు నీటమునిగాయి. కొన్ని ఇళ్ళు, వాటిలో సామాగ్రి, ఇంటి ముందు ఉన్న కార్లు, బైక్లు, స్కూటీలు వరద ఉదృతిలో కొట్టుకుపోయాయి.
ఇళ్ళలోకి వరద నీరు చేరడంతో నిత్యావసర సరుకులు, బట్టలు, టీవీ, ఫ్రిడ్జ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు బురద నీటిలో మునిగిపోయి పాడైపోయాయి. అనేక ఇళ్ళలో బీరువాలు కొట్టుకుపోవడంతో వాటిలో దాచుకున్న డబ్బు, బంగారం, విలువైన పత్రాలు కూడా పోవడం ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కట్టుబట్టలతో మిగిలామని మహిళలు రోదిస్తున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సిఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలని కలిసి ధైర్యం చెప్పారు. వారికి తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.10,000 అందిస్తామని చెప్పారు.
రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారని దాని ప్రకారం బాధిత కుటుంబాలకు ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తరపున అన్ని విదాలా సహాయ సహకారాలు అందిస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.