టీటీడీలా యాదాద్రికి కూడా త్వరలో పాలకమండలి

గత ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించి సకల సౌకర్యాలు కల్పించినప్పటి నుంచి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపధ్యంలో ఆలయ నిర్వహణ భారం మరింత పెరుగుతోంది. ఇంతకాలం ఆలయ ఈవో ఆధ్వర్యంలోనే ఆలయ నిర్వహణ జరుగుతోంది. కానీ యాదాద్రికి కూడా టీటీడీ తరహాలో యాదాద్రి పాలక మండలి (బోర్డు) ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి సూచించారని సీఎంవో ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. 

దేవాలయాల అభివృద్ధిపై సచివాలయంలో జరిగిన తాజా సమీక్షా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి యాదాద్రి ఆలయ రాజగోపురానికి బంగారు తాపటం పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. యాదాద్రిలో మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 

కీసరగుట్టపై శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం తరహాలో పునర్నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులని ఆదేశించారు.