రామగుండంలో మరో విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తాం: భట్టి

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రభాకర్, శ్రీధర్ బాబులతో కలిసి రామగుండం ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రామగుండంలోనే రూ.8,000 కోట్లు వ్యయంతో 800 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన సూపర్ క్రిటికల్ ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని (ఆర్‌టీఎస్) ఏర్పాటు చేస్తాము. ప్రస్తుతం ఉన్న 62.5 మెగావాట్స్ బి-ధర్మల్ ప్రాజెక్టుని కూడా 800 మెగావాట్స్ సామర్ధ్యానికి విస్తరించేందుకు సన్నాహాలు ప్రారంభించాము” అని చెప్పారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీజాక్) ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. రామగుండంలో మూతపడిన పాత విద్యుత్ కేంద్రానికి 560 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. సమీపంలోనే సింగరేణి బొగ్గు గనులు కూడా ఉన్నాయి.

ధర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించడంలో నిపుణులైన ఇంజనీర్లు జెన్‌కోలో ఉన్నారు. కనుక వారితోనే రామగుండంలో సూపర్ క్రిటికల్ ధర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించుకున్నట్లయితే తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చని టీజాక్ సూచించింది. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.