హైడ్రా దెబ్బకి మేల్కొన్న అధికారులు

సిఎం రేవంత్‌ రెడ్డి హైడ్రాని ఏర్పాటు చేసినప్పుడు ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు కానీ అది కూల్చివేతలు మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు.

అప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు పూర్తిగా మెల్కోలేదు కానీ ఎప్పుడైతే అక్రమ కట్టడాలకు అనుమతులు మంజూరు చేసిన అధికారులపై కేసులు నమోదు చేయడం ప్రారంభించారో వారు కూడా పూర్తిగా మేల్కొన్నారు. 

ఇదివరలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రైవేట్ వ్యక్తులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఇళ్ళు, అపార్ట్‌మెంట్‌లు, లే అవుట్ ప్లాన్స్ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏలో సంబందిత అధికారులు  ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లని పెద్దగా పట్టించుకునేవారు కారు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం పొంచి ఉండటంతో దరఖాస్తులలో ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా లేదా అని మరింత నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఒక్క చదరపు అడుగు నిబంధనలకు విరుద్దంగా ఉందని గుర్తించినా ఆ దరఖాస్తులని నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌ పరిధిని గుర్తించేందుకు అవసరమైతే నీటిపారుదల, రెవెన్యూ శాఖల సాయం తీసుకుని మరీ దరఖాస్తులను భూతద్దం పెట్టి మరీ పరిశీలిస్తున్నారు. 

జీహెచ్‌ఎంసీలో మొత్తం 1,06,921 దరఖాస్తులురాగా వాటిలో 34,644లని పరిశీలించి 2,903 దరఖాస్తులను తిరస్కరించారు. అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక వాటిలో కేవలం 116 దరఖాస్తులకు ఆమోద ముద్ర వేశారు. 

అదేవిదంగా  హెచ్ఎండీఏలో3,58,464 దరఖాస్తులలో 1,16,148 పరిశీలించి 787లకి ఆమోదించి 653 దరఖాస్తులని తిరస్కదించారు. 

తిరస్కరణకు గురైన దరఖాస్తులన్నీ ఎఫ్‌టిఎల్ నిబంధనలకు విరుద్దంగా లేదా బఫర్ జోన్‌ పరిధిలో ఉన్నవే కావడం విశేషం. 

జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏలో ఈ మార్పు చాలా అభినందనీయం. ఈ మార్పు శాశ్వితమైతే భవిష్యత్‌లో హైడ్రా అవసరమే ఉండదు.