ఇది పెద్ద సినిమా కలెక్షన్ల గురించి కాదు...జి.హెచ్.ఎం.సి. కలెక్షన్ల గురించి. ప్రధాని నరేంద్ర మోడీ పాత నోట్లని రద్దు చేస్తూ ప్రకటించిన తరువాత పెద్ద సినిమాలు షూటింగ్ కొనసాగించలేని పరిస్థితి ఏర్పడితే, ఆస్తిపన్ను వసూలు చేయడానికి ముప్పతిప్పలుపడే జి.హెచ్.ఎం.సి., రాష్ట్రంలో ఇతర మున్సిపల్ కార్పోరేషన్లు, నగర పంచాయితీలు రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. అందుకు కారణం రూ.500, 1,000 నోట్లతో ఆస్తిపన్ను చెల్లించడానికి, రెండేళ్ళకి అడ్వాన్సుగా ఆస్తిపన్ను చెల్లించడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించడమే. ప్రజలు ఇంకా బారీగా తరలివస్తున్నందున ఈ గడువుని సోమవారం అర్ధరాత్రి వరకు పొడిగించినట్లు జి.హెచ్.ఎం.సి.కమీషనర్ జనార్ధన్ రెడ్డి మీడియాకి తెలిపారు. అయితే పన్ను బాకాయిలపై వడ్డీ మాఫీ చేయబోవడం లేదని చెప్పారు.
పాత నోట్లని వదిలించుకోలేక నానాబాధలు పడుతున్నవారందరూ మున్సిపల్ కార్యాలయాల ముందు గంటలు గంటలు క్యూలో నిలబడి మరీ ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. శుక్ర, శని రెండు రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.23.50 కోట్లు ఆస్తి పన్ను వసూలు అయ్యిందని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి. గోపాల్ తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు అన్నీ ఒక ఎత్తయితే, జి.హెచ్.ఎం.సి. ఒక్కటే ఒక ఎత్తు. ఈ రెండు రోజులలో గ్రేటర్ పరిధిలోనే మొత్తం రూ.65 కోట్లు వసూలయిందని కమీషనర్ జనార్ధన్ రెడ్డి చెప్పారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఆదాయం పెంచుకొనేందుకు, భవనాలు, భూముల క్రమబద్దీకరణ రుసుములు, అదేవిధంగా ఓపెన్ ల్యాండ్ టాక్స్ చెల్లింపులకి కూడా పాత నోట్లని స్వీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులని ఆదేశించారు. కానీ ఈ అవకాశాన్ని నల్లకుభేరులు దురుపయోగం చేయకుండా ఉండేందుకు, ఇప్పటి వరకు నోటీసులు అందుకొన్నవారి నుంచి మాత్రమే ఆ పన్నులు, రుసుములు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ చెల్లింపులకి కూడా సోమవారం అర్ధరాత్రి వరకే గడువు ఇచ్చారు.